రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి

రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి

రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి
  • మానవ ఆక్రమ రవాణాలో తెలంగాణ ముందుంది
  • దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు మంచిదే..
  • దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేంత ఘనత ఏమి సాధించారు
  • ప్రజా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదు
  • తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి,
  • రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత విమర్శలు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుతుంది . మంచిదే.. కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నా అన్యాయాలపై మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎందుకు స్పందించడం లేదని భవనం షకీలా రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నా.. ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆరోపించారు. మానవ ఆక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందన్నారు . 2020లో దేశంలో మానవ ఆక్రమ రవాణా కేసులు 1651 కేసులు నమోదు అయితే.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 184 కేసులు నమోదు అయ్యాయని ఈ విషయం ఎన్సిబీఆర్ నివేదిక వెల్లడించిందని అన్నారు. ప్రతి ఏటా 200 కేసులు నమోదవుతున్న కేసులలో శిక్షలు మాత్రం 2 శాతం కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లైంగిక వేధింపులు పెరుగుతున్నా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే పైనే లైంగిక వేధింపుల ఆరోపణలు
హన్మకొండ జిల్లాలో అధికార పార్టీకి చెందిన మహిళా సర్పంచన్ ని స్థానిక ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు గురి చేసినా.. ఆ ప్రజా ప్రతినిధిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేధిస్తున్నాడని బోడపాటి షేజల్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డా..కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ స్పందించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న దృష్టి ఇతర సమస్యలపై లేకపోవడం బాధాకరం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.10 వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయం, ఇప్పుడు రూ.30 వేల కోట్లుకు పైగా పెరిగిందని అన్నారు . రాష్ట్రంలో పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య పెరిగిందని చెప్పుకొచ్చిన ఆమె వీటిని కట్టడి చేయడం లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందదని ఆరోపించారు. షీటీంలు విఫలం అయ్యాయని అన్నారు. 6 సంవత్సరాల నుండి 60 ఏళ్ల వయస్సున్న మహిళల వరకు రాష్ట్రంలో రక్షణ కరువయ్యిందని అన్నారు . ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చి చూస్తే మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాల గురించి తెలుస్తుందని తెలిపారు . మహిళల సమస్యలపై ప్రభుత్వం ఆఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరు..
తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక కెసిఆర్ కుటుంబం తప్ప ఏ కుటుంబం సంతోషంగా లేదని టీటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరని ఆమె అన్నారు ? దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేంత ఘనత ఏమి సాధించారని ప్రశ్నించారు.
స్వరాష్ట్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబాల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని ప్రభుత్వం వారిని పట్టించుకోవాలని సూచించారు. ఉద్యమంలో ప్రాణాలను ,ఆస్తులను, పొగొట్టుకున్న కుటుంబాల గురించి ఏమాత్రం పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు దోచుకోవడం .. దాచుకోవడం పరమావధిగా చేసుకుందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు చేసిన అభివృద్దే ఇప్పటి ప్రభుత్వం కొనసాగిస్తున్నదే కానీ, కొత్తగా చేసిందీ ఏమీ లేదని అన్నారు.మిగులు బడ్జెట్ ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు .